విదేశీ గడ్డపై మరోసారి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ భారత ప్రజలను భయపెడుతోందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో రాహుల్ చర్చా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.
‘‘అంతా తమకే తెలుసు అని ప్రజలను నమ్మించే వ్యక్తులు భారత్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వారు శాస్త్రవేత్తలకే శాస్త్రాన్ని చెబుతారు. చరిత్రకారులకు చరిత్రను వివరిస్తారు. సైన్యానికి యుద్ధాన్ని నేర్పిస్తారు. వారు దేవుడితో కూర్చుంటే ఆయనకే వివరించగల సమర్థులు. ప్రధాని నరేంద్ర మోదీ అందుకు గొప్ప ఉదాహరణ. ఒకవేళ.. మోదీ ఆ భగవంతుడి పక్కన కూర్చుంటే.. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తు్ందని దేవుడికే చెప్పగలరు. అప్పుడు భగవంతుడు కూడా తాను సృష్టించిన విశ్వం ఇదేనా అని గందరగోళానికి గురవుతారు’’ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు.