రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. కశ్మీర్‌ను పట్టుకుని వేలాడటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని పాకిస్థాన్‌కు స్పష్టం చేశారు. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి అని హితవు పలికారు. సోమవారం ఆయన జమ్మూ యూనివర్సిటీలో జరిగిన భద్రతా సదస్సులో మాట్లాడారు. భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని స్పష్టం చేశారు.
‘‘కశ్మీర్ నుంచి ప్రపంచ దృష్టిని భారత్ మళ్లిస్తుందని పాకిస్థాన్ అంటోంది. ఇది నిజమని నేనూ అంగీకరిస్తా. చాలా వరకు దృష్టిని మళ్లించడంలో విజయం సాధించాం. భారత్‌లో ఉన్న కశ్మీరీలు శాంతితో జీవనం సాగించడాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు గమనిస్తున్నారు. అక్రమంగా పీవోకేను కబ్జా చేసినంత మాత్రానా అది పాకిస్థాన్‌దైపోదు. పీవోకే ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను చూస్తుంటే భారత్‌లో కలిపేయాలని అక్కడి నుంచే డిమాండ్ వస్తుంది. టీవీల్లో కూడా వాళ్లు చాలా సార్లు భారత్‌లో తమను విలీనం చేయమని చెబుతున్నారు. ఇది చిన్న విషయం కాదు’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.