పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు: రాజ్‌నాథ్‌

-

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను భారత్‌ ఎప్పటికీ వదులుకోబోదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. అలాగే భారత రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్‌ అనేక దుష్ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. కశ్మీర్‌ అభివృద్ధిని చూసి అక్కడి ప్రజలే తమంతట తాముగా భారత్‌లో భాగం కావాలని కోరుకుంటున్నారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయి. అక్కడ AFSPA (సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) అవసరం లేదు. దాన్ని ఎత్తివేసేందుకు సమయం సమీపించింది. ప్రస్తుతానికి ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది. అక్కడే తగిన నిర్ణయాలు తీసుకుంటారు. త్వరలో జమ్మూకశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. అని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. బీజేపీ సొంతంగా 370 స్థానాల్లో గెలుస్తుందని, క్షేత్రస్థాయి పరిస్థితులు క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఈ అంచనాకు వచ్చామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news