‘సభలో సింహం’.. వెంకయ్యపై ప్రశంసల జల్లు.. ఎంపీల స్పెషల్ రిక్వెస్ట్

రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడుకు ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా ఘన వీడ్కోలు పలికారు. ఆగస్టు 10న ఆయన ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోనున్న నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో సభ్యులంతా వెంకయ్యకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు. ఎంపీలు ప్రాంతీయ భాషల్లో మాట్లాడేందుకు అనుమతించారని కొనియాడారు. ఆత్మకథ రాయాలని వెంకయ్యను కోరారు.

ఎన్ని ‘ఒత్తిళ్లు’ ఉన్నా వెంకయ్య బాగా పని చేశారని కితాబిచ్చారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. “నాకు వెంకయ్య నాయుడు 30-40 ఏళ్లుగా, అంటే కర్ణాటక భాజపాకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. రాజ్యసభ ఛైర్మన్​గా ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం రావాలని ఆకాంక్షించారు. మీరు(వెంకయ్య) అసంపూర్ణంగా వదిలేసిన పనిని ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆశిస్తున్నా. మీ, నా సిద్ధాంతాలు వేర్వేరు. మీ సిద్ధాంతంతో నాకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఫిర్యాదులకు ఇది సమయం కాదు. సంక్లిష్ట పరిస్థితులు, ఒత్తిళ్లు ఉన్నా మీరు బాధ్యతల్ని నిర్వర్తించారు. అందుకు ధన్యవాదాలు, అభినందనలు.” అని అన్నారు ఖర్గే. ప్రజా జీవితంలో వెంకయ్య మరింత కాలం పాటు చురుకుగా ఉంటారని, యువతకు మార్గదర్శిగా నిలుస్తారని ఆకాంక్షించారు.

 “సంప్రదాయం కాబట్టి మీకు వీడ్కోలు పలుకుతున్నాం. కానీ అలా ఎప్పటికీ చేయలేం. మా డీఎంకే సహచరులు అందరి తరఫున మీకు అభినందనలు. వెంకయ్య.. సభలోని అందరినీ క్రమశిక్షణలో పెట్టగల ‘సింహం’. రాజ్యసభలో మాత్రమే ఏ సభ్యుడైనా 22 షెడ్యూల్డ్​ భాషల్లో ఏ భాషలోనైనా మాట్లాడవచ్చు. అది వెంకయ్య వల్లే సాధ్యమైంది. సర్.. దయచేసి మీరు ఆత్మకథ రాయండి. భావితరాలకు మీరు చేసే సహాయం అదే అవుతుంది.” అని వెంకయ్యను కోరారు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ.