ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ మీరు ఇంకా నమోదు చేసుకోలేదా? అయితే మీకో శుభవార్త మీకోసం ఈ కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 74 శాతం మాత్రమే నమోదు చేసుకోవడంతో.. మిగిలిన వారి కోసం అవకాశం కల్పించింది కేంద్రం. అయితే మరో అవకాశం ఉండకపోవచ్చని, త్వరగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.
సంక్షేమ పథకాలు అర్హులకే అందించడానికి పకడ్బందీగా చర్యలు చేపట్టిన కేంద్ర సర్కార్.. అందులో భాగంగానే రేషన్ కార్డులకు ఈ- కేవైసీ తప్పనిసరి చేసింది. తమకు అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ కేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులు సూచించారు. పలు దఫాలుగా అవకాశం ఇచ్చినా ఇంకా మిగిలిపోయిన కారణంగా ఎక్కువ మందికి నష్టం కలిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో నమోదు చేసుకోవడానికి మరోమారు అవకాశం కల్పించింది. అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని అధికారులు కోరుతున్నారు.