నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను తమ ఎదుట హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులతో రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. ఈడీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలో భాగంగా రేవంత్ రెడ్డి బిజెపి ప్రభుత్వం పై విమర్శలు సంధించారు.
గాంధీ కుటుంబంపై ఈగ వాలినా అంతు చూస్తామని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక పోరాటం ఎనలేనిది అన్నారు. అలాంటి పత్రికను కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరించింది అన్నారు. ఈ విషయంలో త్యాగధనులు అయిన గాంధీ కుటుంబానికి కేంద్రంలోని బిజెపి ప్రమేయంతోనే ఈడి నోటీసులు ఇచ్చిందన్నారు. గాంధీ కుటుంబానికి అవసరమైతే వేల కోట్ల డబ్బును తమ కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వగలరని అన్నారు.