ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు హెచ్చ‌రిక‌.. అలాంటి లింక్స్ వ‌స్తే స్పందించ‌కండి..!

-

క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అయితే కేటుగాళ్లు ఇదే విష‌యాన్ని అదనుగా చేసుకుని ఎంతో మందిని మోసం చేస్తున్నారు. నిమిషాల్లోనే లోన్ ఇస్తామ‌ని చెబుతూ బాధితుల బ్యాంక్ ఖాతాల్లో ఉండే న‌గ‌దును స్వాహా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా మోసాలు పెరిగిపోయాయి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా ఇదే విష‌యంపై త‌న వినియోగ‌దారుల‌కు తాజాగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

sbi alerts its customers about loan frauds

కొంద‌రు కేటుగాళ్లు కేవ‌లం 5 నిమిషాల్లోనే లోన్ ఇస్తామంటూ కాల్స్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్‌ల‌ను కూడా పంపుతున్నారు. కాల్స్ రిసీవ్ చేసుకున్న‌వారికి కూడా లోన్ తీసుకోవాల‌ని చెప్పి లింక్‌ను పంపిస్తున్నారు. దీంతో నిజ‌మే అని న‌మ్మే బాధితులు ఆ లింక్‌ల‌ను సంద‌ర్శిస్తున్నారు. అయితే అలాంటి లింక్‌ల‌పై క్లిక్ చేయ‌గానే కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే బాధితుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు మాయం అవుతోంది.

ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా మోసాలు ఎక్కువగా జ‌రుగుతున్న నేప‌థ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త‌న ఖాతాదారుల‌ను హెచ్చ‌రించింది. ఇలా ఎవ‌రైనా కాల్స్ చేసినా, మెసేజ్‌లు పంపినా స్పందించ‌వద్ద‌ని, వాటిల్లో ఉండే లింక్‌ల‌ను క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని, చేస్తే బ్యాంకు ఖాతా నిమిషాల్లోనే ఖాళీ అవుతుంద‌ని హెచ్చ‌రించింది. ఇన్‌స్టంట్ లోన్ పేరిట ఎవ‌రైనా లోన్ ఇస్తామ‌ని చెబితే న‌మ్మ‌కూడ‌ద‌ని తెలిపింది. కేవ‌లం బ్యాంకుల‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించ‌డం ద్వారా లేదా బ్యాంక్ బ్రాంచిని సంప్ర‌దించ‌డం ద్వారా మాత్ర‌మే లోన్ల‌కు అప్లై చేయాల‌ని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news