గోద్రా అల్లర్ల కేసు.. ఎనిమిది మంది దోషులకు బెయిల్

-

గుజరాత్‌లో 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో ఎనిమిది మంది దోషులకు ఇవాళ సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 17 ఏళ్లకుపైగా జైలు జీవితం పూర్తి చేసుకున్నారనే దాన్ని ఆధారంగా చేసుకుని.. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ ఎనిమిది మంది ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. నేరంలో కీలక పాత్ర దృష్ట్యా మరో నలుగురు దోషుల బెయిల్‌ పిటిషన్‌లను తిరస్కరించింది. ఈ నలుగురికి ట్రయల్‌ కోర్టు తొలుత మరణ శిక్ష విధించగా.. తదనంతరం గుజరాత్‌ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది.

 

దోషులపై TADA చట్టం ప్రయోగించినట్లు తెలిపిన గుజరాత్‌ ప్రభుత్వం.. వారిని ముందస్తుగా విడుదల చేయకూడదని విజ్ఞప్తి చేసింది. అటు దోషుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. వారు 17 ఏళ్లు జైలులో ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంను కోరారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు 8 మందికి బెయిలు మంజూరు చేసి మరో నలుగురి అభ్యర్థనలను తిరస్కరించింది.

2002 ఫిబ్రవరిలో గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్‌లో ఓ రైలుకు నిప్పంటించిన ఘటనలో దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్‌లో పెద్దఎత్తున అల్లర్లకు దారితీసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news