కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముంబయి పర్యటనలో భద్రతా లోపం జరిగింది. ఓ అనుమానాస్పద వ్యక్తి ఆంధ్రా ఎంపీ అనుచరుడినని , హోం శాఖ అధికారినని చెబుతూ ఓ అనుమానాస్పద వ్యక్తి పర్యటనలో షా చుట్టూ చక్కర్లు కొట్టాడని పోలీసులు తెలిపారు.
ఈ వారం కేంద్ర హోం మంత్రి రెండు రోజుల పాటు ముంబయి పర్యటనకు వెళ్లారు. అక్కడ భాజపా నేతలతో సమావేశమై పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించారు. బుధవారం ఆ పర్యటన ముగిసింది. అయితే.. ఈ పర్యటనలో ఓ భద్రతా వైఫల్యాన్ని గుర్తించారు. ఓ వ్యక్తి హోం మంత్రిత్వ శాఖ ఐడీ కార్డు ధరించి భద్రతా బృందంలో కనిపించాడు. కొన్ని గంటల పాటు అమిత్ షాకు దగ్గర్లోనే చక్కర్లు కొట్టాడు. అయితే.. అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు వెంటనే ముంబయి పోలీసులకు సమాచారం అందించారు.
అతడి పేరు హేమంత్ పవార్‌గా గుర్తించారు. భద్రతా సిబ్బంది బృందంలో ఆ పేరు లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్టు చేసి, ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీ అనుచరుడినని అతడు చెప్పుకొన్నట్లు తెలిపారు. అయితే.. అతడు ఏ ఎంపీ పేరు చెప్పి వెళ్లాడనే వివరాలు తెలియరాలేదు.