కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వివిధ కంపెనీలకు చెందిన టీకాలను వేస్తున్నారు. కొన్ని కంపెనీలకు గాను సింగిల్ డోస్ వేస్తున్నారు. చాలా వరకు టీకాలను రెండు డోసుల మేర తీసుకోవాల్సి వస్తోంది. అయితే ఈ విధంగా డోసులను వేసుకున్నా గానీ కోవిడ్ డెల్టా వేరియెంట్ ప్రభావం చూపిస్తుండడంతో ప్రస్తుతం కోవిడ్ బూస్టర్ షాట్స్ వేయాలని చర్చ నడుస్తోంది. అయితే ఇంతకీ అసలు బూస్టర్ షాట్స్ అంటే ఏమిటి ? వాటిని మనం తీసుకోవాలా ? అంటే..
సింగిల్ డోస్ టీకా లేదా రెండు డోసుల టీకా తీసుకున్నాక 6 నెలల సమయం దాటి ఉన్నవారు బూస్టర్ షాట్ తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బూస్టర్ షాట్ అంటే ఇంకో డోసు టీకా. దీని వల్ల కోవిడ్ నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.
కోవిడ్ టీకా పూర్తి స్థాయిలో డోసు తీసుకున్న తరువాత కూడా కొందరికి మెరుగైన రోగ నిరోధక శక్తి ఉండడం లేదు. పైగా డెల్టా వేరియెంట్ కూడా వ్యాప్తి చెందుతోంది. అందువల్లే బూస్టర్ డోస్ తీసుకోమని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలు దేశాలు టీకా పూర్తి డోసు తీసుకుని 6 నెలలు గడుస్తున్న వారికి బూస్టర్ షాట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
అయితే భారత్‌లో డెల్టా వేరియెంట్ ప్రభావం మరీ అంతగా లేదు. పైగా టీకాలు కూడా మెరుగ్గానే పనిచేస్తున్నాయి. అందువల్ల మన దగ్గర బూస్టర్ షాట్స్ అవసరం రాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే విదేశాల్లో లాగే డెల్టా వేరియెంట్ విజృంభించినా, పూర్తి స్థాయి టీకాలను తీసుకున్న వారికి మెరుగైన రక్షణ వ్యవస్థ లేకపోయినా.. మన దేశంలోనూ బూస్టర్ షాట్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి.