నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజీనామా విషయంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచిస్తానని శరద్ పవార్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయనతో చర్చించినట్లు ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ తెలిపారు.
రాజీనామా విషయంలో.. తాను, సుప్రియా సూలే, ఇతర పార్టీ నాయకులు శరద్ పవార్‌ను కలిసి మాట్లాడినట్లు అజిత్ పవార్ చెప్పారు. ఇందుకు పవార్ సానుకూలంగా స్పందించారని అజిత్ వివరించారు. రెండు, మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని శరద్ పవార్ పేర్కొన్నట్లు స్పష్టం చేశారు.
“మీ (కార్యకర్తలను ఉద్దేశించి) అందరి వల్లే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంపై మరోసారి ఆలోచిస్తా. నాకు రెండు, మూడు రోజుల సమయం కావాలి. కానీ, పార్టీ కార్యకర్తలు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోమ్మని చెప్పండి. నా నిర్ణయంతో పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్న వారంతా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి” అని శరద్ పవార్ తమతో చెప్పారని అజిత్ పవార్ వెల్లడించారు.