బ్యాంకులు, ప్రభుత్వాలు ప్రజల బ్యాంకింగ్ సమాచారం పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డెబిట్, కార్డుల మోసాలు అధికంగా జరుగుతున్నాయి. అయితే దేశంలో ఉన్న ప్రజల డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా చోరీ అయిందా ? దీనిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా ? అని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.
2019 అక్టోబర్ నెలలో దేశంలోని వినియోగదారులకు చెందిన 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా డార్క్ నెట్‌లో లభ్యమైందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే ఈ విషయంపై ఏం చర్యలు తీసుకున్నారు ? అని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. దీనిపై ఆర్‌బీఐని అప్రమత్తం చేశామన్నారు.
దేశంలో డిజిటల్ పేమెంట్ విధానంలో సైబర్ సెక్యూరిటీని మరింత పెంచేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. CERT-In, ఆర్‌బీఐలు ఫిషింగ్‌లకు పాల్పడే వెబ్‌సైట్‌లను నిలిపివేస్తున్నాయని, ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న సైబర్ దాడులు, వాటికి పరిష్కారాలను సూచిస్తున్నాయని, మాల్‌వేర్, ఇతర వైరస్‌లను నాశనం చేసేందుకు ఉచితంగా టూల్స్ ను అందిస్తున్నాయని, ఇందుకు గాను కేంద్రం నేషనల్ సైబర్ కో ఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌సీసీ)ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఇక తప్పుడు లావాదేవీలు, మోసాలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా ? అని అడిగిన ప్రశ్నకు కూడా మంత్రి సమాధానం ఇచ్చారు. బ్యాంకుల వల్ల తప్పిదాలు చోటు చేసుకున్నట్లు తేలితే అందుకు కస్టమర్లకు బ్యాంకులే పరిహారం చెల్లిస్తాయని తెలిపారు. ఇందుకు కస్టమర్ మోసం జరిగిన 3 రోజుల్లోగా బ్యాంకుకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే కస్టమర్ తప్పిదం వల్ల మోసం జరిగితే అందుకు కస్టమర్ బాధ్యత వహిస్తాడని, కానీ అతను బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకు మాత్రమే ఈ నియమం వర్తిస్తుందని, ఫిర్యాదు చేశాక బ్యాంకులదే బాధ్యత అని అన్నారు.
ఇక బ్యాంకు, కస్టమర్ ఇద్దరిలో ఎవరి తప్పిదం లేకపోయినా మోసం జరిగితే అలాంటి స్థితిలో కస్టమర్ మోసం జరిగిన నాటి నుంచి 4 నుంచి 7 పనిదినాల్లోగా ఫిర్యాదు చేయాలని, ఈ క్రమంలో కస్టమర్ రూ.5వేల నుంచి రూ.25వేల మేర నష్టాన్ని భరించాల్సి వస్తుందని అన్నారు. అలాగే 7 రోజుల తరువాత ఫిర్యాదు చేస్తే బోర్డు తీసుకునే నిర్ణయం, బ్యాంకు అనుమతితో కస్టమర్‌కు నష్ట పరిహారం చెల్లించాలా, వద్దా అనేది నిర్ణయిస్తారని తెలిపారు.