ప్రైవేట్ మార్కెట్లలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధ‌ర ఎంతంటే..?

-

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఉత్ప‌త్తి చేస్తున్న ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్‌ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఒక్క డోసును ప్రైవేట్ మార్కెట్లలో రూ.1,000 కి విక్రయించనున్నట్లు ఎస్ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అద‌ర్ పూనావాలా వెల్ల‌డించారు. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ మొదటి 100 మిలియన్ డోసులను భారత ప్రభుత్వానికి కేవ‌లం రూ.200 ప్రత్యేక ధరకు మాత్రమే విక్రయిస్తున్నామ‌ని, ఎందుకంటే పేదలు, ఆరోగ్య సంరక్షణ కార్మికుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం త‌క్కువ ధ‌ర‌కు వ్యాక్సిన్‌ను ఇవ్వాల‌ని అడిగింద‌ని, అందుక‌నే రూ.200కు కేంద్రానికి వ్యాక్సిన్‌ను అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు.

SII to sell Covishield for Rs 1000 per dose in private markets

సాధార‌ణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్క డోసు ధ‌ర రూ.200 క‌న్నా ఎక్కువే అని, అయితే తాము భార‌త ప్ర‌భుత్వ కోరిక మేర‌కు, ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తిని అనుస‌రించి వ్యాక్సిన్ ఒక్క డోసును కేవ‌లం రూ.200 కే విక్ర‌యించ‌ద‌లిచామ‌ని, దీని వ‌ల్ల తమ‌కు లాభం రాద‌ని, అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం కోసం ఇలా వ్యాక్సిన్‌ను చాలా త‌క్కువ ధ‌ర‌కు అందిస్తున్నామ‌ని తెలిపారు.

అయితే ప్రైవేటు మార్కెట్ల‌లో వ్యాక్సిన్ ఒక్క డోసు ధ‌ర రూ.1000 ఉంటుంద‌ని తెలిపారు. కాగా దేశంలోని ప్ర‌తి ఒక్క‌రికీ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అందించ‌డ‌మే ప్ర‌స్తుతం త‌మ ముందు ఉన్న ల‌క్ష్య‌మ‌ని పూనావాలా అన్నారు. ఈ క్ర‌మంలోనే తాము ప్ర‌తి నెలా 70 నుంచి 80 మిలియ‌న్ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నామ‌ని తెలిపారు. ఇందుకు గాను కేంద్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ లాజిస్టిక్స్ ప్రణాళికలను రూపొందించింద‌ని, అందులో భాగంగానే కోల్డ్ స్టోరేజ్‌ ట్రక్కులు, వ్యాన్లు త‌దిత‌ర వాహ‌నాల‌ను వినియోగిస్తున్నామ‌ని తెలిపారు.

ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను త‌మ‌కు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరుతూ ఇత‌ర దేశాలు భార‌త్‌కు లేఖ రాశాయ‌ని, అయితే అన్ని దేశాల‌కు వ్యాక్సిన్‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, మ‌రోవైపు దేశంలోనూ రాష్ట్రాల‌కు వ్యాక్సిన్‌ను స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని పూనావాలా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news