సీడబ్ల్యూసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్షురాలిగా కొనసాగలేనని, మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ ప్రధాని మన్మోహన్ పేరును ప్రతిపాదించారు. కాగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే అంటోని సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరారు.
ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావాలంటే పార్టీలో సమూలమైన మార్పులు తీసుకురావాలని కోరుతూ 23 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీకి లేఖ రాయడంతో ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా, ఈ లేఖపై రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాంటి లేఖ రాయడానికి ఇది సరైన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీ ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ రకమైన లేఖను ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు.