చావ్లా గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను నిర్దోషులుగా తేల్చడంపై సుప్రీం క్లారిటీ

-

దిల్లీ చావ్లా గ్యాంగ్ రేప్, హత్య కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను నిర్దోషులుగా తేలుస్తూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం విమర్శలకు దారి తీసింది. దీనిపై సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఈ కేసు విచారణ సమయంలో అనేక లోపాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. అందుకే ‘బెనిఫిట్ ఆఫ్‌ డౌట్’ కింద నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పించినట్లు స్పష్టం చేసింది. 2012లో దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో ఓ 19ఏళ్ల యువతి సామూహిక అత్యాచారం, హత్యకు గురైన సంగతి తెలిసిందే.

‘‘ఈ కేసులో నిందితులపై ఉన్న అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైంది. కేవలం సహేతుకమైన సందేహాలు మినహా ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయింది. అందుకే అత్యంత క్రూరమైన నేరంలో నిందితులుగా ఉన్నా.. వారిని నిర్దోషులుగా ప్రకటించడం తప్ప కోర్టుకు మరో అవకాశం లేకుండా పోయింది.’’ అని కోర్టు వివరించింది.

ఈ కేసులో 49 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్ విచారించగా.. ఇందులో 10 మందిని డిఫెన్స్‌ కౌన్సిల్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయలేదని కోర్టు పేర్కొంది. దర్యాప్తు సమయంలో ఒక్క సాక్షి కూడా నిందితులను గుర్తించలేదని తెలిపింది. మృతదేహం వద్ద లభించిన సాక్ష్యాలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని.. అత్యాచారం, హత్య జరిగిన మూడు రోజుల తర్వాత ఓ పొలంలో మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు చెబుతున్నారని, అప్పటివరకు ఎవరూ మృతదేహాన్ని చూడకపోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది.

ఈ కేసులో ట్రయల్‌ కోర్టు కొన్ని కీలక అంశాలను విస్మరించి తీర్పు వెలువరించిందని, దాన్ని హైకోర్టు కూడా సమర్థించిందని సుప్రీంకోర్టు తెలిపింది. అందుకే బెనిఫిట్‌ ఆఫ్ డౌట్‌ కింద నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పించినట్లు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news