రేపు దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ

నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు పంపిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ జూన్ 2న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు పంపగా.. విదేశాల్లో ఉన్న కారణంగా ఆయన హాజరు కాలేదు అన్న విషయం తెలిసిందే. దీంతో ఈనెల 13న విచారణకు రావాలని ఈడి మరోసారి సమన్లు పంపింది.

దీంతో ఆయన సోమవారం విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే సోనియా గాంధీ జూన్ 8న విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు పంపగా.. ఆమెకు కరోనా సోకడంతో హాజరుకాలేదు. కాగా జూన్ 23న విచారణకు రావాలని ఈడి మళ్లీ సమన్లు పంపింది. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలకు వివరాలు తెలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేపు దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించి.. ఆ కేసుపై పూర్తి వివరాలు చెప్పాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ శనివారం ఈ ప్రకటన చేసింది.