ప్రమాదాలు అనేవి చెప్పి రావు. అనుకోకుండానే వస్తాయి. కొన్ని ప్రమాదాలు మన అనారోగ్య సమస్యల వల్ల కూడా జరుగుతుంటాయి. అలాగే ఓ వ్యక్తికి ప్రమాదం జరగబోయింది. కానీ పక్కనే ఉన్న ఓ వ్యక్తి అతన్ని కాపాడాడు. కేరళలో ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
కేరళలోని కోజికోడ్‌లో ఉన్న ఎడొడి అనే ప్రాంతంలోని కేరళ బ్యాంక్ బ్రాంచికి కొందరు వ్యక్తులు వచ్చారు. వారు భవంతిలో పై అంతస్తులో ఉన్న బ్యాంక్ కార్యాలయం ఎదుట కారిడార్లో నిలుచున్నారు. అయితే ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పాడు. పిట్టగోడకు ఆనుకుని నిలబడడంతో అతను స్పృహ తప్పిన వెంటనే వెనక్కి కిందకు పడబోయాడు. కానీ అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి అతని కాలును పట్టుకున్నాడు. దీంతో చుట్టూ ఉన్న వారు కూడా అలర్ట్ అయి ఆ వ్యక్తిని పైకి లాగి కాపాడారు.
కాగా కింద పడబోయిన వ్యక్తిని బినుగా గుర్తించారు. అతను సాధారణంగానే స్ఫృహ తప్పి పడిపోయాడని, అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తరువాత అతన్ని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఇక అతన్ని కాపాడిన తయ్యిల్ మీతల్ బాబును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బాబు బినును పట్టుకోకుండా ఉంటే అతనికి తీవ్ర గాయాలు అయి ఉండేవని, ప్రాణాపాయం సంభవించేదని, బాబు వల్లే బిను బతికిపోయాడని నెటిజన్లు బాబును అభినందిస్తున్నారు. కాగా అక్కడే అమర్చిన సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఆ వీడియో వైరల్‌గా మారింది.