దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఉదయం నుంచే సూర్యుడు భగ్గున మండిపోతున్నాడు. బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజా వాతావరణ పరిస్థితులపై కేంద్ర వాతావరణ శాఖ పలు కీలక సూచనలు చేసింది. కొన్ని రాష్ట్రాల్లో హీట్ వేవ్ కొనసాగుతుందని.. మరికొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని.. దీంతో ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపింది.
దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేకంగా ఉత్తర కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ హీట్ ఉందని చెప్పారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా ఉందని పేర్కొన్నారు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం ఈ రాష్ట్రాల్లో అక్కడకక్కడ ఉరుములతో కూడిన వర్షపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని శుభవార్త చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడిగాలులు వీస్తాయని చెప్పుకొచ్చారు.