రిజర్వేషన్లపై మోడీ మార్కు కాటు ఇది!

కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రైవేటీకరణ జపం చేస్తుంది. జాతిసంపదనంతా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడిట్టేవరకూ కంటి మీద కునుకు కూడా వేసేలా లేదు. రైల్వేలు, విమానాశ్రయాలు, ఎయిర్ పోర్టులతో పాటు బ్యాంకింగ్, భీమా, పెట్రోలియం సంస్థలను కూడా అమ్మేయాలని నిర్ణయించుకుంది. వీటితో పాటు షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్ సంస్థలను కూడా ప్రైవేటు పరం చేసేయాలని నిర్ణయించుకుంది! ఫలితంగా బహుజనులను బానిసత్వంలోకి నెట్టనుంది! జాతి సంపదను ప్రైవేటు పరం చేసే ముసుగులో రిజర్వేషన్లు ఎత్తేసేపనికి పూనుకుంది!

Narendra-Modi

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల నిధుల సమీకరణ పేరుచెప్పి జాతీయ సంపదను అమ్మేసే నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. దానికి మానిటైజేషన్ అని అందమైన నామకరణం కూడా చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు రూ.3.50 లక్షల కోట్ల విలువైన ఆస్తులను అమ్మేసిన మోడీ సర్కార్… భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొదలైన లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ వాటాలను విక్రయించేయాలని ఫిక్సయ్యింది. అనంతరం మరో 46 ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించేయాలని ప్రణాళిక చేస్తోంది!

సుమారు 35లక్షల మంది ఉపాధి పొందుతున్న ప్రభుత్వరంగ సంస్థల్లో బ్యాంకింగ్, రైల్వే, బీమా రంగాలకు చెందిన ఆస్తులను అమ్మేస్తున్నారు మోడీ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం ద్వారా రిజర్వేషన్లు అనే అంశం పూర్తిగా పోయే ప్రమాధం ఉంది. అంటే… పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తేసే పనికి నరేంద్ర మోడీ పూనుకున్నారన్నమాట. ఫలితంగా… బహుజనులకు తేనెపూసిన కత్తితో గొంతుకోయబోతున్నారు!

అలా అని ఇది కేవలం రిజర్వేషన్లు కలిగిన ప్రజలకు మాత్రమే సమస్య అనుకుంటే పొరపాటే. రైల్వే, బీమా, పెట్రోల్ సంస్థలు పూర్తిగా ప్రైవేటు పరం అయితే… ధరలు ఆకాశానికి చేరుకునే ప్రమాధం ఉంది! ఆయా యాజమాన్యాలు నిర్ణయించిన ధరలే అమలులోకి వస్తాయే తప్ప… పెరిగిన పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలపై ప్రశ్నించే హక్కును ప్రజలు కోల్పోతారు! ఈ విషయాల్లో ప్రభుత్వాలకు జవాబుదారీ తనం అవసరం లేదు కాబట్టి.. వీటి ధరల నిర్ణయంపై నియంత్రణ ఉండదు!

మోడీ మార్కు ప్రైవేటు ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. “గ్రామపంచాయతీలు స్వావలంబన సాధించాలంటే.. ఉన్న ఆస్తులను అమ్మేసుకోవాలి” అని మోడీ సర్కార్ చెబుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలంటూ ఆదేశాలు జారీచేసింది! అంతేకాదు… గ్రామసభలోనే ఈ మానిటైజేషన్ గురించి చర్చించాలంట. ఫలితంగా.. వృత్తిపన్ను, ఆస్తిపన్ను, ఆస్తులను లీజులకివ్వడం, సర్వీస్ చార్జీలు విధించడం వంటి కార్యక్రమాలకు తెరలేవనుందన్నమాట!

అంటే… ఇకపై పంచాయతీలు వాటికున్న ఊరుమ్మడి ఆస్తులను అమ్మేసి ప్రైవేటు కంపెనీల సేవలో పునీతమవ్వాలన్నమాట. ఇది కేంద్ర ప్రభుత్వ ఇంగితం!! బడుగు, బలహీనవర్గాలను మరింత బలహీనులుగా, మరింత బడుగులుగా మార్చే విధానం!!

-CH Raja