కరోనా వైరస్ వ్యాపించకుండా కట్టడి చేయాలంటే హ్యాండ్ శానిటైజర్లు లేదా హ్యాండ్ వాష్‌లు, సబ్బులతో చేతులను శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమే. ఇక ఇంట్లోనూ డిసిన్ఫెక్టెంట్లతో శుభ్రం చేయాలి. దీంతో కోవిడ్‌ను అడ్డుకోవచ్చు. అయితే కొందరు విపరీతమైన భయాందోళనలకు గురై అవసరానికన్నా మించి డిసిన్ఫెక్టెంట్లను వాడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభం కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని వారు అంటున్నారు.
కరోనా భయంతో ఇంటిని, వస్తువులను, దుస్తులను, కూరగాయలను పదే పదే డిసిన్ఫెక్టెంట్లతో శుభ్రం చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఇల్లు, వస్తువులను వాటితో శుభ్రం చేస్తే చాలని, దుస్తులు, కూరగాయలను వాటితో శుభ్రం చేయాల్సిన పనిలేదని అంటున్నారు. ఇక ఇల్లు, వస్తువులను కూడా ఒక్కసారి శుభ్రం చేస్తే చాలని, పదే పదే శుభ్రం చేయాల్సిన పనిలేదని అంటున్నారు. డిసిన్ఫెక్టెంట్లలో ఉండే రసాయనాలు మనకు హాని కలిగిస్తాయని చెబుతున్నారు.
డిసిన్ఫెక్టెంట్లలో అమ్మోనియా సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆస్తమాను కలగజేస్తాయి. పదే పదే బ్లీచింగ్ చేయడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. చర్మం, కళ్లలో దురదగా అనిపిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్, ఆల్కహాల్, సిట్రిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఉన్న డిసిన్ఫెక్టెంట్లను వాడాలని సూచిస్తున్నారు. కానీ వీటిని ఆహార పదార్థాలు, దుస్తులు, వంట సామగ్రిపై వాడకూదని చెబుతున్నారు. ఇక ఆయా డిసిన్ఫెక్టెంట్లను నేరుగా చేతుల్తో టచ్ చేయరాదని, సురక్షితమైన సామగ్రిని ధరించాకే వాటిని ఉపయోగించి ఇంటిని శుభ్రం చేయాలని అంటున్నారు.
చేతులకు గ్లోవ్స్, ముఖానికి మాస్కులను ధరించి డిసిన్ఫెక్టెంట్లతో శుభ్రం చేయవచ్చని, కానీ పదే పదే వాటిని వాడకూడదని తెలిపారు. లేదంటే శ్వాస సమస్యలతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇక ఇంట్లో డిసిన్ఫెక్టెంట్లతో శుభ్రం చేసే సమయంలో పిల్లలు, వృద్ధులను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే ఇంట్లోకి గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేలా చూడాలన్నారు.