రాష్ట్రపతి కాలేదన్న బాధలేదు.. నేనేదీ కోరుకోలేదు : వెంకయ్య నాయుడు

-

ఉప రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి స్థానానికి వెళ్లలేకపోయానన్న బాధ ఏమాత్రం లేదని, దాని గురించి ముందు నుంచీ తాను ఆలోచించలేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా బుధవారం మధ్యాహ్నం తన నివాసంలో విలేఖరులతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. ఉప రాష్ట్రపతి పదవి కూడా తొలి నుంచీ ఇష్టం లేదని, ఈ ప్రోటొకాల్‌ ఆంక్షలు తన తత్వానికి సరిపడవన్నారు.

‘నేను ఏదీ కోరుకోకపోయినా దేవుడి దయ, పెద్దల అభిమానం వల్ల అన్నీ లభించాయి. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నాకంటే సీనియర్లు ఉన్నా నన్ను సభాపక్ష నాయకుడిగా చేసి ప్రోత్సహించారు. జాతీయస్థాయి పదవులూ అలాగే దక్కాయి. వాజ్‌పేయీ మంత్రివర్గంలో సమాచార ప్రసారశాఖ, రవాణాశాఖ లాంటివి ఇస్తానంటే వద్దన్నా. ఏం కావాలో కనుక్కోమని ఆడ్వాణీని పురమాయించారు. అప్పుడు నేనే వాజ్‌పేయీ వద్దకు వెళ్లి వ్యవసాయశాఖ అడిగా. అప్పటికే మిత్రపక్ష నేత నీతీశ్‌కుమార్‌కు ఆ శాఖ కేటాయించినందున ఆయన్ను కాదనడం బాగుండదని చెప్పారు. నాకు ఆర్థికంలాంటివి అర్థం కావు కాబట్టి, గ్రామీణాభివృద్ధిశాఖ కోరినప్పుడు వాజ్‌పేయీకి నాపై అభిమానం మరింత పెరిగింది. మోదీ హయాంలోనూ పట్టణాభివృద్ధిశాఖ ఇచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతానికి చెందిన నాకు పట్టణాభివృద్ధి గురించి ఏం తెలుసని అడిగా. ఇప్పుడు గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి.. మీకు ఇదే కరెక్టు అని చెప్పారు’ అని గతం గుర్తు చేసుకున్నారు. అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లా ప్రఖ్యాత కళాశాలల్లో చదువుకోకపోయినా ప్రజలతో నిరంతరం మమేకం కావడమే జ్ఞానం నేర్పిందన్నారు.

మోదీకి అపూర్వమైన శక్తి ఉందని, రోజుకు 14 గంటలపాటు నిరంతరాయంగా.. సీరియస్‌గా పనిచేస్తారని వెంకయ్యనాయుడు మెచ్చుకున్నారు. ‘ఆయన పనితీరును చూసి నా సతీమణి రెండు సూచనలు చేయమని చెప్పారు. అందులో ఒకటి అప్పుడప్పుడూ నవ్వుతూ ఉండటం, రెండోది రోజూ అవసరమైనంత నిద్రపోవడం. ఈ రెండూ మోదీకి చెప్పా. తర్వాత ఆయన పనిచేసే సమయంలో నవ్వడం నేర్చుకున్నారు. నిద్ర మాత్రం రాదని చెప్పేవారు’ అని వివరించారు.

మళ్లీ రాజకీయాల్లోకి రానని, క్రియాశీలకంగా ఉండటం మాత్రం మానబోనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూనే ఉంటానన్నారు. తన ముందుకు వచ్చే అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు. ‘పుస్తకం రాస్తే వాస్తవాలు రాయాలి. బతికున్నవారి గురించి యథార్థాలు రాస్తే అనర్థాలు వస్తాయి’ అని చమత్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news