వయనాడ్ విధ్వంసం.. 9 మందిని పొగొట్టుకున్న శ్రుతి లైఫ్‌లో మరో విషాదం!

-

ఇటీవల కేరళలోని వయనాడ్‌లో‌ ప్రకృతి విలయం సంభవించిన విషయం తెలిసిందే. వయనాడ్‌లో విలయానికి తల్లిదండ్రులు సహా కుటుంబంలో 9 మందిని కోల్పోయిన శ్రుతి అనే అమ్మాయి జీవితంలో మరో తీవ్ర విషాదం నెలకొంది. వయనాడ్ జిల్లాలోని చురాల్‌మల్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల శ్రుతికి జూన్ 2న తన చిరకాల మిత్రుడైన జెన్సన్ (27)తో నిశ్చితార్థం జరిగింది.ఈ మతాంతర వివాహానికి ఇరు కుటుంబాలు సైతం అంగీకరించాయి. ఆ తర్వాత జూన్ 30న వయనాడ్‌లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా ఆమె తల్లిదండ్రులు, సోదరి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

అంతటి క్లిష్ట సమయంలో శ్రుతికి తనకు కాబోయే భర్త జెన్సన్ అండగా నిలిచి ధైర్యం చెప్పాడు. ఆమె కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకొని అనుక్షణం ఆమె వెంటే ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నాడు. వీరిద్దరి గురించి జాతీయ మీడియాలోనూ వార్తలు వచ్చాయి.ఈనెలలో వారిద్దరి పెళ్లి కావాల్సి ఉంది.ఈ క్రమంలోనే ఆమె జీవితంలో మరో విషాదం నెలకొంది.ఈ నెల 10న శ్రుతి,జెన్సన్‌ సహా ఇతర కుటుంబ సభ్యులు వ్యానులో వెళ్తుండగా కోజికోడ్-కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వ్యాన్-ప్రైవేటు బస్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జెన్సన్‌ తీవ్రంగా గాయపడ్డాడు.మిగతా వారు స్వల్పంగా గాయపడగా.. తీవ్రంగా గాయపడిన జెన్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందినట్లు సమాచారం. తనకు ఉన్న ఒకే ఒక్క దిక్కును కోల్పోవడంతో శ్రుతి ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news