అలాంటి వారు పాకిస్థాన్ వెళ్లిపొండి !

లక్నో : ఉత్తరప్రదేశ్ అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత సోమ్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. తాజాగా ఆయ‌న యూపీలోని చందౌసీలో భార‌తీయ యువ మోర్చా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముస్లింల‌పై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ”దేశంలోని కొందరు ముస్లింలు భార‌త సైంటిస్టుల‌ను, పోలీసుల‌ను, సైన్యాన్ని నమ్మడం లేదు. దేశాన్ని ముందుకు న‌డుపుతున్న ప్ర‌ధాని మోడీని కూడా న‌మ్మరు. కానీ పాకిస్థాన్ ను న‌మ్ముతారు. అలాంటి వారు పాకిస్థాన్ వెళ్లిపోవ‌చ్చు” అని సంగీత సోమ్ అన్నారు. దేశ శాస్త్రవేత్తలను, వ్య‌వ‌స్థ‌ను అనుమానించడం దారుణమనీ, ఇది మంచి పని కాదని పేర్కొన్నారు.

అలాగే, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దులో ఆందోళ‌న‌లు చేస్తున్న వారు రైతులు కాద‌నీ, వారు రైతు వ్య‌తిరేకుల‌ని పేర్కొన్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌తో పాటు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌పై కూడా ఆయ‌న తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి కొన్ని నెలలు జైలు జీవితం గడిపినందున, రౌడీలా మాట్లాడుతున్నారంటూ సంగీత్ సోమ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.