భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో రికార్డు సృష్టించడానికి అడుగు దూరంలో ఉన్నాడు. గురువారం రాత్రి జరిగే ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్ లో బంగారు పతకమే లక్ష్యంగా, ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో చారిత్రక రజతం తర్వాత.. గజ్జల్లో గాయం కారణంగా అతను కామన్వెల్త్ క్రీడలకు దూరమైన సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న అతను.. డైమండ్ లీగ్ లూసానే అంచే పోటీల్లో పసిడి పట్టాడు.
ఆ పోటీల్లో ఈటెను 89.08 మీటర్ల దూరం విసిరిన ఈ 24 ఏళ్ల ఒలంపిక్ ఛాంపియన్.. ఫైనల్స్ లో 90 మీటర్ల లక్ష్యాన్ని అందుకుంటాడేమో చూడాలి. డైమండ్ లీగ్ 32 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. 13 సిరీస్ లలో (లీగ్స్) పెర్ఫార్మన్స్ ద్వారా అత్లేట్లు తమ విభాగాల్లో ఫైనల్ ఈవెంట్ కు అర్హత సాధిస్తారు. ప్రతి కేటగిరిలో ఫైనల్స్ నెగ్గిన విన్నర్ ను డైమండ్ లీవ్ ఛాంపియన్ గా పిలుస్తారు. దాంతో ఇండియా నుండి డైమండ్ లీగ్ ఛాంపియన్ అవ్వాలని చోప్రా ఆశిస్తున్నాడు.