కశ్మీర్ సమస్య అంతర్జాతీయ స్థాయికి చేరడానికి కారణం మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నే అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కశ్మీర్ సమస్యకు అంతర్జాతీయ ప్రాధాన్యత రావడం వల్లే.. ఈ సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. కాగ ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. రాజ్య సభలో కశ్మీర్ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సమస్య భారత దేశానికి సంబంధించిన సమస్య అని అన్నారు.
కానీ జవహర్ లాల్ నెహ్రూ వల్ల అంతర్జాతీయ అంశంగా మారిందని ఆరోపించారు. కాగ భారత్ – పాక్ మధ్య మొదటి యుద్దం జరిగిన సమయంలో.. 1948 లో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. కాశ్మీర్ సమస్యపై ఐక్య రాజ్య సమితి లో ఫిర్యాదు చేశారని అన్నారు. అప్పటి నుంచి కశ్మీర్ సమస్య.. భారత దేశం అంశంగా కాకుండా.. అంతర్జాతీయ అంశంగా మారిందని అన్నారు.
దీంతో భారత్ – పాక్ మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఐక్య రాజ్య సమితి ఒక కమిషన్ ను ఏర్పాటు చేసిందని అన్నారు. తర్వాత కమిషన్ల ద్వారా ఈ సమస్య ఇంకా జఠిలం అయిందని అన్నారు. కాగ నెహ్రూ ఐక్య రాజ్య సమితికి వెళ్లాలని బ్రిటీష్ వారే సలహా ఇచ్చి ఉంటారని ఆరోపించారు.