దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే అది కూడా గ్రీన్ ఫైర్ క్రాకర్స్ కాల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఇదే విషయంపై మెసేజ్ ఇస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో నెటిజన్లు మళ్లీ అతనిపై ఫైర్ అవుతున్నారు.
దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దేవుడి ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. గుర్తుంచుకోండి, దీపావళికి బాణసంచా కాల్చకండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. మీ చుట్టూ ఉండే మీరు ప్రేమించే వారిని రక్షించండి. కేవలం దీపాలను మాత్రమే వెలిగించి స్వీట్లను ఇచ్చి పుచ్చుకుంటూ దీపావళిని జరుపుకోండి.. అంటూ కోహ్లి ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Happy Diwali 🙏🏻 pic.twitter.com/USLnZnMwzT
— Virat Kohli (@imVkohli) November 14, 2020
కోహ్లి తన విలాసవంతమైన కార్లతో పర్యావరణాన్ని ఎక్కువగా నాశనం చేస్తున్నాడని, అలాగే అతని భార్య అనుష్క శర్మ డ్యాన్స్ చేస్తే బాణసంచా కాల్చడం లేదా అని, కోహ్లి క్రికెట్ ఆడే మైదానాల కోసం ఎన్నో చెట్లను నరుకుతున్నారని.. ఇవన్నీ పట్టించుకోకుండా కోహ్లి జనాలకు బాణసంచా కాల్చవద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అనేక మంది నెటిజన్లు అతనిపై సెటైర్లు వేస్తున్నారు.
కాగా కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తోటి ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నెల 27 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. వన్డేలు, టీ20లకు కోహ్లి అందుబాటులో ఉండనున్నాడు. కానీ టెస్టులకు అందుబాటులో ఉండడం లేదు. తన భార్య అనుష్క శర్మకు జనవరిలో డెలివరీ ఉన్నందున సెలవు కావాలని కోరగా.. బీసీసీఐ అతనికి పెటర్నిటీ సెలవును ఇచ్చింది. అయితే నీకు దేశం కన్నా కుటుంబమే ముఖ్యమా, ధోని అలా చేయలేదు, అతనిని చూసి నేర్చుకో.. అంటూ ఇటీవలే ఫ్యాన్స్ అతనిపై మండిపడ్డారు. ఈ క్రమంలో తాజాగా అతను దీపావళి పండుగను ఉద్దేశించి పెట్టిన ట్వీట్ మరోసారి నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.