సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ బి.1.1.529.. ఎంత ప్రమాదకరమంటే..

కరోనా మహమ్మారి కొత్త రూపు సంతరించుకుంటుంది. రోజురోజుకూ ఉత్పరివర్తనం చెందుతూ ప్రపంచాన్ని వణికిస్తున్నది. తాజాగా బహుళ ఉత్పరివర్తనాలు కలిగిన కొవిడ్-19 కొత్త వేరియంట్ బి.1.1.529ను కనుగొన్నట్లు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గురువారం వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు 22 నమోదైనట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసిజస్ ధ్రువీకరించింది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంపై ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఎన్‌ఐసీడీ కార్యనిర్వహక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అడ్రియన్ ప్యూరెన్ తెలిపారు.

నూతన వేరియంట్ తీవ్ర ఆందోళనకరమైందని , కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నదని దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా తెలిపారు. ఈ నెల ఆరంభంలో రోజువారీ కేసుల సంఖ్య 100 ఉండగా, బుధవారం నాటికి 1200లకు చేరుకున్నది. గత ఏడాది సౌతాఫ్రికాలో బెటా వేరియంట్ వైరస్‌ను కనుగొన్నారు. భారత్‌లో వెలుగులోకి వచ్చిన డేల్టా వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికాలో కొవిడ్-19 కేసుల నమోదు తీవ్ర స్థాయిలో ఉన్నది. ఆఫ్రికా ఖండంలోనే దక్షిణాఫ్రికాలో అత్యధిస్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యయి. మొత్తం 20.95లక్షల కేసులు నమోదు కాగా, 89,657 మంది ప్రాణాలను కోల్పోయారు.