వాట్సప్ వినియోగదారులకు శుభవార్త.. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వేదిక వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. వాట్సాప్ యూజర్లు ఇకపై 100 మీడియా ఫైళ్లను ఒకేసారి పంపుకోవచ్చు. ఇప్పటిదాకా మీడియా 30 ఫైళ్లను మాత్రమే షేర్ చేసే వీలుండేది. ఇప్పుడా పరిమితిని 100కి పెంచింది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకే అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని ఐఓఎస్ యూజర్లకు కూడా అందించనున్నారు. కాగా, ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లలో ఈ ఫీచర్ అనేబుల్ కాకపోతే, ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ (2.23.4.3)కి అప్ డేట్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది. ఒకేసారి మరిన్ని ఫొటోలు, ఇతర మీడియా ఫైళ్లు పంపుకోవడానికి ఈ ఫీచర్ ఉపయుక్తంగా ఉంటుందని వాట్సాప్ భావిస్తోంది.
ఇదిలా ఉంటే.. వాట్సాప్ లో ఇకపై పెద్ద ఫైల్స్ కూడా సులభంగా పంపుకోవచ్చు. అంటే.. ఒక సినిమా వీడియో మొత్తాన్ని ఒకే ఫైల్లో పంపుకోవచ్చు. ఇప్పటివరకూ పెద్ద సైజు ఫైల్స్ వీడియోలను పంపుకునే వీల్లేదు. ఎందుకంటే.. కేవలం 100MB వరకు మాత్రమే ఫైల్స్ పంపుకోనే వీలుంది. ఇకపై ఆ సమస్య ఉండదు. వాట్సాప్ తమ యూజర్ల కోసం ఫైల్ సైజు పరిమితిని పెంచేసింది. 100MB నుంచి 2GB వరకు పెంచేసింది. ఒక సినిమా ఫుల్ వీడియో సైజు ఫైళ్లను కూడా ఈజీగా ఒకరి నుంచి మరొకరికి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ప్లాట్ ఫాంపై ఏదైనా ఫొటోలు లేదా వీడియోలను 2GB ఫైల్ సైజు వరకు పంపుకోవచ్చు అనమాట.