రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ప్రత్యర్ధి పార్టీలని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉంటుంది. వారిని ఎలా దెబ్బకొట్టాలని చూస్తుంటుంది. కానీ అన్నీ రాజకీయాలు పార్టీలు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు. అసలు అంతర్గత ప్రజస్వామ్యం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకునే కాంగ్రెస్…బహిరంగంగానే సొంత నాయకులపై విమర్శలు చేసుకుంటారు. సొంత పార్టీలోనే నాయకులు ఎదగకూడదని ఒకరిపై ఒకరు కుట్ర చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే జరుగుతుంది.
అసలు మొదట నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇదే జరుగుతూ వస్తుంది. ఇక రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక మరింతగా ఆధిపత్య పోరు పెరిగింది. అసలు వేరే పార్టీ నుంచి వచ్చిన ఓ జూనియర్ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించడం ఏంటని రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్లు రగిలిపోతున్న విషయం తెలిసిందే. అధిష్టానం సర్దిచెప్పింది కాబట్టి కొందరు సీనియర్లు సర్దుకుపోయారు గానీ, కొందరైతే రేవంత్‌పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
అయితే ఇప్పటికీ పలువురు సీనియర్లు రేవంత్ అంటే గుర్రుగానే ఉన్నారు. పైగా తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ మరో నాయకుడుకు లేదు. వైఎస్సార్ తర్వాత కాంగ్రెస్‌లో వన్ మ్యాన్ షో రేవంత్‌దే నడుస్తోంది. దీంతో ఆదిలోనే రేవంత్‌కు చెక్ పెట్టేయాలని సీనియర్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా సభల్లో రేవంత్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవ్వడం, ఆయనకు మిగిలిన నేతలు భజన చేయడం, సభల్లో రాహుల్, సోనియాల తర్వాత రేవంత్ కటౌట్‌లే భారీగా కనిపించడం లాంటి అంశాలు సీనియర్లకు ఒళ్ళు మండేలా చేస్తున్నాయి.
దీంతో రేవంత్‌ని కట్టడి చేయడానికి సీనియర్లు త్వరలోనే అధిష్టానానికి ఫిర్యాదులు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రేవంత్ వన్ మ్యాన్ షో తగ్గించడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని సమాచారం. మొత్తానికైతే సీనియర్లు అంతా రేవంత్‌కు స్పాట్ పెట్టినట్లే కనిపిస్తున్నారు.