వైసీపీలో ధిక్కార స్వరం మొదలైందా..? ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలను నేతలు పక్కన పెడుతున్నారా..? ఎంపీలు ఏమాత్రం లెక్క చేయడం లేదా..? అంటే నేతలు అంగీకరించకపోయిన జరుగుతున్న పరిణామాలు మాత్రం అందుకు అవుననే సమాధానం చెబుతున్నాయి. విజయసాయిరెడ్డికి చెప్పకుండానే నేరుగా కేంద్ర మంత్రులను కలువొద్దని వైసీపీ ఎంపీలకు జగన్మోహన్‌రెడ్డి సూచించిన వారు పట్టించుకోవడం లేదని సమాచారం. మొన్నటి మొన్న లోక్‌సభలో ప్రధాని మోదీ రాజుగారు బాగున్నారా ..? అంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు కుశల ప్రశ్నలు వేశారు.
మరుసటి రోజూ ఆయన ఏకంగా ప్రధాని ఛాంబర్‌కు వెళ్లి గంటన్నరకు పైగా ముచ్చటించడం వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతోన్న వేళ పార్టీ ఎంపీలపై నిఘా ఉన్నా కూడా రఘురామకృష్ణం రాజు ఏకంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లి గంటన్నర సేపు ఉండడం పార్టీ వర్గాలకే మింగుడు పడడం లేదు. ఈ విషయం తెలుసుకున్న విజయసాయిరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలమైనట్లు సమాచారం. దీంతో జగన్‌తో మాట్లాడుదామని చెప్పి విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డితో కలసి రాజుగారిని అమరావతికి తీసుకురావడం..జగన్‌తో భేటీ జరగడం ఆయన అదేం లేదు..ప్రధాని తనకున్న పాత పరిచయంతోనే పలుకరించారంటూ సమాధానం చెప్పి వెళ్లారు.
ఇంతటితో విషయం సద్దుమణిగింది అనుకుంటే తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు ప్రధాని కలవడం విశేషం. దాదాపు గంటన్నర పాటు వీరి భేటీ జరిగిందని తెలుస్తోంది. ఏదైనా సమస్య అయితే పది పదిహేను నిముషాలకు మించి చర్చించడానికి ఏం ఉండదు. కానీ అంత సమయం ప్రధాని వెచ్చించారంటే ఏదో ఉందన్న ప్రచారం వైసీపీలో మొదలైంది. మాగుంటకు కూడా ఇతర రాష్ట్రాల్లోనూ చాలా బిజినెస్‌లే ఉన్నాయి. ఆయనకు ప్రధాని అంత టైం ఇవ్వడంతో మళ్లీ పార్టీ వర్గాల్లో కలవరం స్టార్ట్ అయ్యింది. ఇదే విషయాన్ని మాగుంట వద్ద ప్రస్తావిస్తే రాష్ట్రంలో మానవహక్కుల కమీషన్‌ను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలపడం విశేషం. పొగాకు బోర్డు లో స్థానికులకు అవకాశం కల్పించాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.
అయితే ప్రధాని మోదీని కలిసే ముందు వైసీపీ పార్లమెంటరీ వ్యవహారాల ఇన్‌చార్జి విజయసాయిరెడ్డికి చెప్పే వెళ్లారా..? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఆయన కొద్దిరోజులుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇటీవల ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని విజయసాయిరెడ్డి సమక్షంలోనే బహిరంగ విమర్శలకు దిగడం విశేషం. జిల్లాలో కొంతమంది జగన్‌కు సన్నిహితులని చెప్పుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. చూడాలి మాగుంట ప్రయాణం ఎక్కడికి చేరుతుందో..?! ఇక నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై సైతం పార్టీకి అనుమానాలు ఉన్నాయని గుసగుసలు వస్తున్నాయి.