హైదరాబాద్ మెట్రో రైలు మరో అరుదైన రికార్డును సృష్టించింది.. హైదరాబాద్‌లో మెట్రో రైల్ పట్టాలు ఎక్కిన తర్వాత.. క్రమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో మెరుగు పడుతూ వస్తుంది.. ఇక, గణేష్ నిమజ్జనం మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో రికార్డు స్థాయిలో ప్రయాణికులను తీసుకెళ్లింది.. అయితే, ఇప్పుడు చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది హెచ్‌ఎంఆర్.. జులై 3న మెట్రో రైలులో 5 లక్షల 10 వేలమంది ప్రయాణించారు.
ఒక్కరోజే ఇంత భారీస్థాయిలో ప్రయాణికులు ట్రావెల్ చేయడం సరికొత్త రికార్డ్. నాగోల్ నుండి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుండి కూకట్‌పల్లి రూట్లలో ఎక్కువమంది ప్రయాణించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రో రైలు 40 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో గత కొన్ని రోజులుగా ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆఫీసు వేళల్లో మెట్రోలో జనం రద్దీగా ఉంటున్నారు. అమీర్‌పేట జంక్షన్ ఉదయం, సాయంత్రం కిక్కిరిసిపోతోంది.