గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వాదుల హిట్ లిస్ట్‌లో వున్నాడంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తనకు భద్రతను పెంచుతూ లేక రాశారని తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాకు వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇటీవల అరెస్టైన తీవ్రవాదుల లిస్టులో తన పేరు వున్నట్లు సమాచారం ఇచ్చారని తెలిపారు. బైక్‌పై వద్దని, ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో మాత్రమే తిరగాలని సూచించారని స్పష్టం చేశారు.
డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో తనకు రక్షణ కల్పిస్తున్నారని రాజా సింగ్ పేర్కొన్నారు. గత కొంత కాలంగా తెలంగాణ పోలీసులపై ఒంటి కాలిపై లేచి హంగామా చేసిన రాజా సింగ్ తాజా పరిణామాల నేపథ్యంలో వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇంత వరకు బాగానే వుంది. తనకు కల్పిస్తున్న రక్షణపై రాజా సింగ్ కొత్త మెలిక పెట్టడం ఆసక్తికరంగామారింది.
గతంలో రాజా సింగ్ తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని సీపీని కోరడం అందుకు సీపీ నిరాకరించడం జరిగింది. తాజాగా పరిణామాల నేపథ్యంలో తను గతంలో పెట్టుకున్న గన్ లైసెన్స్‌ని ఇప్పించాలని రాజా సింగ్ తాజాగా తెలంగాణ పోలీసులకు కొత్త మెతిక పెట్టారు. అంతేనా ఈ విషయంలో కేంద్రానికి కూడా తాను లేఖ రాస్తానని, తనకున్న ముప్పు విషయంలో కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి తరుచూ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. మరి దీనిపై నగర సీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.