ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రజలకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇకపై కరోనా టెస్టు ఫలితం కేవలం 30 నిమిషాల్లోనే రానుంది. అంతేకాకుడా టెస్టుకు అయ్యే ఖర్చు కూడా భారీగా తగ్గనుంది. దక్షిణ కొరియాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన నూతన తరహా టెస్టు కిట్‌తో కరోనా ఫలితం చాలా వేగంగా వస్తుంది. దీన్ని ఐసీఎంఆర్ అప్రూవ్ చేయడంతో ఇకపై కరోనా టెస్టులు మరింత ఎక్కువ చేసేందుకు మార్గం సుగమమైంది.
దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సార్ అనే సంస్థ స్టాండర్డ్ క్యూ కోవిడ్-19 ఏజీ డిటెక్షన్ కిట్ పేరిట ఓ నూతన తరహా కరోనా టెస్టు కిట్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా కరోనా టెస్టు ఫలితం కేవలం 30 నిమిషాల్లోనే వస్తుంది. అలాగే ఈ కిట్ 99 శాతం వరకు కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. కేవలం 1 శాతం మాత్రమే తప్పుడు ఫలితం వచ్చేందుకు అవకాశం ఉంది. అందుకనే ఈ కిట్ వాడకానికి ఐసీఎంఆర్ ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కిట్‌ను గుర్గావ్‌లోని సదరు కంపెనీ మానుఫాక్చరింగ్ యూనిట్‌లో తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్న కరోనా టెస్టుల సంఖ్య ఈ టెస్టు కిట్‌తో మరింత పెరగనుంది. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న కిట్‌కు రూ.4500 వరకు ఖర్చవుతోంది. కానీ ఈ కొత్త కిట్‌కు కేవలం రూ.500 మాత్రమే ఖర్చవుతుంది. దీంతో కరోనా టెస్టుపై భారీగా డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఈ కొత్త కిట్‌ను ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లి పెద్ద సంఖ్యలో టెస్టులు చేయవచ్చు. దీంతో చాలా సమయం ఆదా కానుంది. ఫలితంగా కోవిడ్ 19 పేషెంట్లకు త్వరగా చికిత్స అందించేందుకు వీలు కలుగుతుంది.