ఆ ఏపీ మంత్రిని డామినేట్ చేస్తోన్న ఎమ్మెల్యేలు…!

-

ఏపీలో అధికార వైసీపీలో కొంత మంది మంత్రుల మాటకు విలువ లేకుండా పోతుందా..! కొన్ని జిల్లాలో మంత్రులను, సీనియర్ ఎమ్మెల్యేలు డామినేట్ చేస్తూ ఉండడంతో పాటు జిల్లా యంత్రాగాన్ని తమ చేతుల్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో దాదాపు సగం మంది మంత్రుల మాటకు విలువ లేకుండా పోతుంద‌న్న‌ టాక్ వచ్చేసింది. నిన్న,మొన్నటి వరకు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను అదే జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు టార్గట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు జోరుగా వార్తలు వినిపించాయి.

ఇప్పుడు చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరిస్థితి కూడా అలాగే ఉన్నట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా వైసీపీలో పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే అనూహ్యంగా నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నారాయణ స్వామి జిల్లా నుంచి మంత్రిగా ఉన్నా మరో మంత్రి అయిన‌ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవానే జిల్లాలో నడుస్తోంది.

ప్రస్తుతం జిల్లా రాజకీయాలను పెద్దిరెడ్డితో పాటు ఆయన తనయుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తమ కనుసైగలతో శాసిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రోజాకు మంత్రి పదవి దక్కక పోవడం వెనుక కూడా పెద్దిరెడ్డి చక్రం తిప్పారు అన్న‌ టాక్ వైసీపీలో ఉంది. ఇక పెద్దిరెడ్డి సంగతి పక్కన పెడితే జిల్లాలో ఓ మోస్త‌రు ప్రభుత్వ అధికారులు సైతం నారాయణస్వామి మాట పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు. ఇంకా చెప్పాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా లాంటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

వారు మంత్రులు కాకపోయినా వారి మాటకు చాలా విలువే దక్కుతోందట చిత్తూరు జిల్లాలో..! మంత్రి కన్నా మంత్రులు కాని వారికే అక్కడ రాజకీయంగా ఎక్కువ విలువ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా అధికారులు కూడా వారికి జీ హుజూర్ అంటున్నారట.. ఈ పరిస్థితి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనే కాదు. విజయనగరం, అనంతపురం, కడప జిల్లాలో సైతం ఉందని వైసిపి వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news