అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు ఈమధ్య జనవాసాల్లోకి ఎక్కువగా వస్తున్నాయి. రావడమే కాకుండా పశువులు, మనుషులపై దాడులు చేస్తున్నాయి. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పులులు, చిరుతపులుల సంచారం జనవాసాల్లో సాధారణమైపోతోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలో పెద్దపులి మనుషుల్ని చంపుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
పౌరి జిల్లా పరిధిలోని మొత్తం 25గ్రామాల పరిధిలో అధికారులు కర్ఫ్యూ విధించారు. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ ఆసీస్ చౌహాన్ మాట్లాడుతూ.. 25 గ్రామాల్లో రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేస్తున్నట్టు వెల్లడించారు.. మంగళవారం వరకు అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేయాలని ఆదేశించినట్టు తెలిపారు.
ఆ పులిని మనుషుల్ని వేటాడే జంతువుగా ప్రకటించాలని కోట్‌ద్వార్ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ కునర్వార్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీని కోరారు. ఆ పులిని పట్టుకొనేందుకు గ్రామంలో ఓ బోనును ఏర్పాటు చేసినట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పశువులకు మేతను తీసుకొచ్చేందుకు గ్రామస్థులు అడవుల్లోకి వెళ్లొద్దని సూచించారు.