దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంటగా ఎదురు చూస్తున్న నిర్భయ దోషులను రేపు ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. దీనితో తీహార్ జైలు అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు డమ్మీ ఉరి అమలు చేసిన అధికారులు ఈ రోజు కూడా మరోసారి డమ్మీ ఉరి వేసేందుకు గాను అన్నీ సిద్దం చేస్తున్నారు. రేపు ఉదయం… అంటే ఫిబ్రవరి ఒకటి ఉదయం ఆరు గంటలకు ఉరి తీయనున్నారు.
ఇప్పటికే తీహార్ జైలుకి ఉత్తరప్రదేశ్ మీరట్ కి చెందిన తలారి పవన్ జలాద్ చేరుకున్నారు. ఆయన కోసం జైలు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసారు. ఇక ఆయన విషయాలను అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ రోజు తలారి మరోసారి డమ్మీ ఉరి వేయనున్నారు. అదే విధంగా బక్సర్ నుంచి తెప్పించిన ఉరి తాళ్ళను కూడా వాళ్ళు పరీక్షించనున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఉరి అమలు జరుగుతుందా లేదా అనే ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను ఈ రోజు విచారించనున్నారు. అటు.. మరో దోషి వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీనితో రేపు అధికారులు ఉరి అమలు చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. రాష్ట్రపతి తిరస్కరిస్తే 14 రోజులు వాయిదా పడే అవకాశం ఉంది.