ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చెయ్యాలని ఢిల్లీ కోర్ట్ డెత్ వారెంట్ కూడా ఇచ్చినప్పటికీ వివిధ సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ సింగ్ క్షమాభిక్ష పెట్టుకోవడంతో అది వాయిదా పడింది. క్షమాభిక్ష పిటీషన్ పెట్టుకున్న వెంటనే దాన్ని ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించడం,
ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా తిరస్కరించడంతో, అది రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా తిరస్కరించడంతో ఉరి ఖరారు అయింది. వీరికి ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష అమలు చెయ్యాలని డెత్ వారెంట్ ఇచ్చారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తర్వాత కేంద్ర హోం శాఖ పరిశీలించి దోషికి క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం లేదని రాష్ట్రపతికి వివరించింది.
ఈ నేపధ్యంలో రాష్ట్రపతి రామనాద్ కోవింద్ కూడా ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఉరిశిక్ష వ్యవహారం ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాస్పదంగా మారింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించడంతో 14 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి ఒకటిన వారికి ఉరి శిక్షను తీహార్ జైల్లో అధికారులు అమలు చేయనున్నారు.