ఆంధ్రప్రదేశ్ లో రేపే కేబినేట్ సమావేశం జరగుంది. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్న ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ నెల 20 న జరగాల్సిన సమావేశాన్ని రెండు రోజులు ముందుగానే నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సమావేశంలో కేబినేట్ పలు కీలక అంశాల మీద చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో శనివారమే ఏపీ రాజధానుల అంశంపై కీలక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తుంది. శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌తో హైపవర్ కమిటీ సమావేశమై, జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అనంతరం సీఎం జగన్‌కు పూర్తిస్థాయి నివేదికను కమిటి సమర్పించింది. హైపర్ కమిటీ నివేదికపై శనివారం కేబినెట్‌లో మంత్రులు చర్చించనున్నారు.
భేటీ అనంతరం పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులపై ప్రకటన చేయవచ్చని తెలుస్తుంది. జనవరి 20న జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ, రాజధానుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. దీనితో రేపు ఏ ప్రకటన వస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రాజకీయంగా కూడా దీనిపై ఉత్కంట నెలకొంది.