ఆ ఊరిలో అస్సలు బోర్లే ఉండవు.. అయినా ఊరంతా పచ్చని పంటలే..!

-

ఈ రోజుల్లో బోర్లు లేకుండ పంటలు పండించడం అసాధ్యం. ఒకవేళ బోరు లేకున్నా ఇతరుల నుంచైనా నీరు తీసుకుని పండించుకుంటారు. బోరు వేసినా దాదాపుగా వెయ్యి ఫీట్లలోతు వేస్తేనే నీరు వస్తుంది. ఎలాగైన సరే.. బోరు లేకుండా మాత్రం పంటలు పండించడం సాధ్యం కాదు . కానీ.. ఆ ఊరిలో అస్సలు ఒక్కబోరు కూడా లేదు. అయినా ఆ గ్రామంలో ఎప్పుడు పచ్చని పంట పొలాలు కళకళలాడుతుంటాయి. యాసంగిలో కూడా పత్తి, పసుపు, గోధుమ, మొక్కజొన్న పంటలతో కనువిందు చేస్తోంది.

ఎన్నో ఏళ్ల క్రితం ఆ గ్రామస్తులు పెట్టుకున్న ఓ ‘కట్టుబాటే’నేటికీ నీటి కష్టాన్ని రానివ్వలేదు. గ్రామంలో ఎవరూ బోర్లు వేయరాదనే నిబంధనను నేటికీ పాటిస్తూ ఊట బావులపైనే ఆధారపడుతున్నారు నిర్మల్‌ జిల్లా లక్ష్మణచంద మండంలోని బోరిగాం రైతులు. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా ఊటబావుల ద్వారానే పంట పొలాలు సాగుచేస్తుంటారు. దాదాపుగా 40 అడుగులకు పైగా లోతుగా ఉండే ఆ బావుల్లో సగానికి పైగా నీరు ఉంటుంది. నిరంతరం ఊరుతూనే ఉంటాయి.

నాటి కట్టుబాటే..

‘మన గ్రామంలో ఎపుడూ నీటి కష్టం రాకూడదంటే ఊర్లో ఎవరూ బోర్లు వేయొద్దు. ఎన్నాళ్లయినా బావులను తవ్వుకునే సాగు చేసుకోవాలి’ అని ఎప్పుడో బోరిగాం గ్రామస్తులు ముందు చూపుతో ఇప్పటికీ అక్కడ నీటికి ఢోకా లేదు. 50 ఏళ్ల క్రితం తవ్విన బావులు సైతం ఉన్నావి. వివిధ కారణాలతో కుటుంబ సభ్యులు విడిపోయినా పంపకాల్లో తమకు వచ్చిన భూముల్లో మళ్లీ బావులనే తవ్వుకుంటారు తప్ప బోరు మాత్రం అస్సలు వేయరు.

చెరువుల కారణంగా..

ఓరుగల్లు కాకతీయుల ఏలుబడి ప్రభావం నిర్మల్‌ ప్రాంతంపై ఉంది. నిర్మల్‌ను పరిపాలించిన రాజులు సైతం చెరువులు, కుంటల తవ్వకాలను ప్రోత్సహించేవారు. బోరిగాంలో ఉన్న ఆ మూడు చేరువులే ఇప్పటి ఊటబావులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి. ఈ గామానికి ఓ వైపు కొండ ప్రాంతం ఉంది. వానాకాలంలో వాటిపైనుంచి వచ్చే నీరంతా చెరువుల్లో చేరడం. సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌ ఉండటంతో భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటున్నాయి. ఊటలకు ఇవి కూడా ప్రధాన కారణమేనని గ్రామ పెద్దలు చెబుతుంటారు.
ఆ గ్రామంలో మొత్తం వ్యవసాయ సాగు విస్తీర్ణం 594 ఎకరాలు. ఇందులో పత్తి 325, వరి 231, పసుపు 60, సోయా 5, కందులు 32 ఎకరాలలో సాగు చేస్తున్నారు. రెండో పంటగా మొక్కజొన్న, గోధుమ, నువ్వులు సాగు చేస్తున్నారు. చాలామంది అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news