రాజకీయ కురువృద్ధుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిన హన్మంత్ రావు గాడి తప్పారా.? ఓపిక నశించి ఆవేశానికి లోనయ్యారా..? వీహెఛ్ సొంత అధిష్ఠానాన్ని బెదిరించేందుకు పూనకున్నారా..? వీహెఛ్ క్లారిటీ మిస్సయ్యారా.? మొత్తంగా వీహెఛ్ ప్రెస్‌మీట్ చూస్తే అవుననే అనిపిస్తుంది. తను చెప్పాలనుకున్నది చెప్పేశారు మంచిగానే ఉంది.. కానీ ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు మీడియాపై అంత అక్కసు ఎందుకు..? . సోషల్ మీడియాలో సామాన్య జనాలు సంధిస్తున్న కొన్ని ప్రశ్నలు..
మీడియా చెప్పిన వారికే పదవులు ఇస్తుందా అధిష్ఠానం.. ఆ మాత్రం వారికి తెలియదా అనేది డౌటనుమానం. ఇక రెండోది మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే అర్థం ఏమిటో మీరు అర్థం చేసుకోకపోవడం అమాయకత్వంగా ఉంది. ఎప్పుడూ రెడ్డీలకేనా పదవులు అంటూ ప్రశ్నిస్తూనే ఒరిజినల్ రెడ్డీలకు ఇవ్వమనడం లింక్ మిస్సయినట్లనిపిస్తోంది..? నిజానికి కాంగ్రెస్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.. అలాంటప్పుడు మీరు పార్టీని మొత్తంగా మటాష్ చేసేలా మాట్లాడటం ఎంతవరకు సబబు..
మిమ్మల్ని ఢిల్లీ అధిష్ఠానం పక్కన పెట్టిందని.. మీ లేఖలకు రెస్పాండ్ కావట్లేదని చెప్పుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్లు అనిపించట్లేదా..? రేవంత్ ఢిల్లీలో మేనేజ్ చేస్తున్నాడంటూ అమాయకంగా మీరు చెప్పడం రేవంత్ బలవంతుడని చెప్పినట్లు కాదా..? తెలంగాణ వ్యతిరేకి రేవంత్ అంటున్న మీకు తెలంగాణాను వ్యతిరేకించిన టీడీపీతో చెట్టపట్టాలేసుకొని తిరిగింది సమంజసం అనిపించిందా..? రేవంత్ పీసీసీ ఇస్తే మా దారి మేం చూసుకుంటామంటూ మీరు చేసిన వ్యాఖ్యలు బ్లాక్‌మెయిలింగ్ లా అనిపించట్లేదా..?
దశాబ్దకాలంగా ఎన్నో పదవులు చూసిన వీహెఛ్ నోటివెంట ఇలాంటి మాటలు రావడం సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా మీరు ప్రెస్‌మీట్‌లో మాట్లాడినదంతా కేవలం మీ పార్టీకి సంబంధించిన అంశం.. ఈ ప్రెస్ మీట్ వల్ల ఒకవేళ నష్టమంటూ జరిగితే అది కాంగ్రెస్‌కే ఎక్కువ… రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం పార్టీ అంతర్గత విషయం.. దానికి మీడియా పై చిందులు తొక్కడం బాగుందా….??
మాస్ లీడర్ రేవంత్ అని రాస్తే.. అధిష్ఠానం మన పేపర్లు చదివేసి అరే.. రేవంత్‌కే పట్టం కట్టేద్దాం అనుకుంటుందా..? రేవంత్ దే పీసీసీ అని మీడియా రాసేస్తే అది నిజమని మీరు ఉలిక్కిపడటమెందుకు..? ఏళ్ళ తరబడి కాంగ్రెస్‌లో ఉన్న మీరే కాంగ్రెస్ రాజకీయాలను అసహ్యించుకుంటే.. సామాన్యులు ఛీ కొట్టడం తప్పు కాదుగా.. అందుకే గ్రేటర్‌లో, దుబ్బాకలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే…. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో విఫలమైంది కాంగ్రెస్ సీనియర్లేనని మీ అధిష్ఠానం బలమైన నమ్మకం.. అందుకే ఆ నమ్మకంతోనే పక్కకు పెట్టి ఉంటారు.. అంతేగా..?