కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్‌బీఐ గతేడాది మార్చి నుంచి ఆగస్టు వరకు దశలవారీగా మారటోరియం సదుపాయాన్ని అందించిన విషయం విదితమే. అయితే ఆ కాలానికి గాను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వినియోగదారుల నుంచి వడ్డీపై వసూలు చేశాయి. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి రిలీఫ్ కింద కేంద్రం కొంత మేర వినియోగదారులకు వడ్డీలో సబ్సిడీని అందించింది. అయితే ఈ విషయానికి సంబంధించి సుప్రీం కోర్టులో తాజాగా వాదనలు జరగ్గా సుప్రీం కోర్టు తన తుది నిర్ణయాన్ని మంగళవారం వెల్లడించింది.
కరోనా నేపథ్యంలో అమలు చేసిన మారటోరియంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వినియోగదారుల నుంచి వడ్డీపై వసూలు చేయడం కరెక్ట్ కాదని కోర్టు వ్యాఖ్యానించింది. అలా వసూలు చేస్తే ఆ మొత్తాన్ని రీఫండ్ చేయాలని, రీఫండ్ చేసేందుకు వీలు కాకపోతే తదుపరి చెల్లింపుల్లో ఆ మొత్తాలను అడ్జస్ట్ చేయాలని ఆదేశించింది. అయితే మారటోరియం కాలంలో వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలన్న పిటిషనర్ల వాదనను తోసి పుచ్చింది. అది సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
అలాగే కరోనా సమయంలో కేంద్ర, ఆర్‌బీఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అనడం కూడా సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ విషయంలో తన వాదనలు వినిపించిన కేంద్రం మాట్లాడుతూ.. మారటోరియం సమయంలో వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తే దాదాపుగా రూ.6 లక్షల కోట్ల మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నష్టం వస్తుందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతటి నష్టాలను తట్టుకుని ఆయా సంస్థలు నిలబడలేవని తెలిపింది. ఈ క్రమంలోనే కోర్టు మారటోరియం వడ్డీని మాఫీ చేసే అవసరం లేదని తెలిపింది. కానీ వడ్డీపై వడ్డీ వసూలు చేయవద్దని, చేస్తే రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం పై విధంగా తీర్పును వెలువరించింది.