భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికిఎవరు అధిపతి కాబోతున్నారు? దేశానికి సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు జోక్యం చేసుకుంటోంది? అసలు దేశంలో ఎవరికీ సంబంధంలేని విషయం గురించి ఎందుకు ఆందోళనపడుతున్నారు? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేవారి విషయంలో రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం ఏమిటి? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు? లాంటి ప్రశ్నలకు మనకు త్వరలోనే సమాధానం దొరకబోతోంది.
రమణను అడ్డుకోవాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే వచ్చేనెల 23వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన తరపున ప్రధాన న్యాయమూర్తిగా ఎవరుండాలనే విషయాన్ని సూచించమని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ అధికారికంగా లేఖ రాశారు. ఎవరికీ అవసరం లేని ఈ విషయంలో రాష్ట్రంలోని ముఖ్యమైన నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే బాబ్డే తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ అవుతారు కాబట్టి. రమణ నియామకాన్ని అడ్డుకోవాలని అధికారంలోకి వచ్చినప్పటినుంచే కుట్రలు, కుతంత్రాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబునాయుడు, రమణ ఒకే సామాజికవర్గమని, తనను ఇబ్బందిపెడుతున్నారని, తనను జైలుకు పంపిస్తారని కాపాడాలంటూ ఢిల్లీ పెద్దలను కలిసి వేడుకోళ్లు.. విజ్ఞప్తలు. కలిసిన తర్వాత లోపల చెప్పేది ఒకటి.. బయట చెప్పేది ఒకటి.. ఇలాంటి తతంగాలు ఎన్నెన్నో. వ్యవస్థల్లో జోక్యం చేసుకునేవారు ఒకరైతే.. వ్యవస్థలను విధ్వంసం చేసేవారు ఇంకోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరవుతారనేది జస్టిస్ బాబ్దేమీద ఆధారపడివుంది.
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆరోపణలు
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితోపాటు మరో ఆరుగురు జస్టిస్ లను రమణ ప్రభావితం చేసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్ధానాల్లో చికాకులు కలిగిస్తున్నారని జగన్ ఆరోపణలు అప్పట్లో సంచలనమయ్యాయి.జస్టిస్ రమణ పై జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫిర్యాదులు చేశారు. రమణ మద్దతుతోనే చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనేది జగన్ అభియోగం. ఆరోపణలతోపాటు ఆధారాలను కూడా ఇచ్చానని జగన్ తెలిపారు. ఆ ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగానే జేకే మహేశ్వరి ఆకస్మిక బదిలీ జరిగింది. రమణ గనుక చీఫ్ జస్టిస్ అయితే ప్రభుత్వ వ్యవహారాల్లో న్యాయవ్యవస్ధ మితిమీరిన జోక్యం జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబును కాపాడుతున్నది కూడా రమణే అన్నది జగన్ అనుమానాలు. తదుపరి చీఫ్ జస్టిస్ నియామకానికి అధికారిక ప్రక్రియ మొదలైంది కాబట్టి బాబ్డే తన విచారణలో ఏయే విషయాలను బయట పెడతారో? ఎవరిని చీఫ్ జస్టిస్‌గా సూచిస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాలి!.