మొబైల్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై 3 రోజుల్లోనే ఎంఎన్‌పీ..!

-

దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) శుభవార్త చెప్పింది. ఇకపై ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు ఎంఎన్‌పీ (మొబైల్ నంబర్ పోర్టబులిటీ) ద్వారా మారాలనుకుంటే.. కేవలం 3 రోజుల్లోనే ఆ ప్రక్రియ ముగియనుంది. గతంలో ఇందుకు 7 రోజుల సమయం పట్టేది. అయితే ట్రాయ్ కొత్తగా ప్రవేశపెట్టిన నియమ నిబంధనల ప్రకారం ఎంఎన్‌పీ ఇక 3 రోజుల్లోనే ముగుస్తుంది. అలాగే ఎంఎన్‌పీ విషయంలో ట్రాయ్ పలు కొత్త నిబంధనలను కూడా అమలులోకి తెచ్చింది. అవేమిటంటే…

now mnp process will take only 3 days

* గతంలో మొబైల్ వినియోగదారులు యూపీసీ కోడ్ రిక్వెస్ట్ చేస్తే వచ్చే కోడ్‌కు 15 రోజుల వాలిడిటీ అందించారు. అయితే ఇప్పుడా వాలిడిటీని 4 రోజులకు మార్చారు. అంటే వినియోగదారుడు ఒక్కసారి ఆ కోడ్‌ను జనరేట్ చేశాక వెంటనే ఇతర నెట్‌వర్క్‌కు మారిపోవాలన్నమాట. ఆలస్యం చేస్తే ఆ ప్రక్రియ కుదరదు. ఇక జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఇతర ఈశాన్య రాష్ర్టాల్లో ఈ కోడ్‌కు వాలిడిటీని 30 రోజులుగా నిర్ణయించారు.

* గతంలో పోర్టింగ్ సమయం 96 గంటలుగా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 48 గంటలకు కుదించారు. అలాగే ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారేందుకు గతంలో 7 రోజులు పడితే ఇప్పుడు 3 రోజుల్లోనే ఆ ప్రక్రియ ముగియనుంది. ఇక ఒక సర్కిల్‌లో ఉన్న నెట్‌వర్క్ నుంచి మరొక సర్కిల్‌లో ఉన్న నెట్‌వర్క్‌కు మారాలనుకుంటే గతంలో 10 రోజులకు పైగానే సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లోనే ఆ ప్రక్రియ ముగియనుంది.

* ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు మారాలనుకుంటే ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌లో కనీసం 90 రోజుల పాటు యాక్టివ్ సబ్‌స్ర్కైబర్ అయి ఉండాలి. ఇక కొత్త నెట్‌వర్క్‌కు మారాక మళ్లీ 90 రోజుల పాటు అందులో ఉంటే తప్ప మరొకసారి ఎంఎన్‌పీకి వీలుపడదు.

* ఒకసారి పోర్ట్ అవుట్ రిక్వెస్ట్‌ను పెట్టాక.. ఆ రిక్వెస్ట్‌ను వద్దనుకుంటే వినియోగదారులు తమ పత్రాలను ఇచ్చిన 24 గంటల లోపు ఆ రిక్వెస్ట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీంతో ఎంఎన్‌పీ క్యాన్సిల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news