రూ.40 లక్షలతో ఎన్టీఆర్ ఆరోగ్య రథం రెడీ.. సంతోషంలో బాలయ్య ఫ్యాన్స్..!!

నందమూరి బాలకృష్ణ కు ఆయన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజులో కనీసం వంద సార్లైనా తన తండ్రిని తలుచుకోనిదే రోజు గడవదు అని, ఇప్పటికే ఆయనతో కలిసి పనిచేసిన ఎంతోమంది స్టార్లు మనకు తెలియజేశారు. ఇక తండ్రి బాటలోనే నడుస్తూ ఎంతోమందికి సేవను అందిస్తున్న బాలయ్య.. హిందూపురం టీ డీ పీ ఎమ్మెల్యేగా ప్రజాసేవలో ముందుంటారు. ఇప్పటికే హైదరాబాద్ లో తన తల్లి పేరు మీద బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు బాలయ్య.

ఇక ఈ క్రమంలోనే తాజాగా తన నియోజకవర్గం హిందూపురం ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం రూ.40 లక్షలు ఖర్చు చేసి మరీ ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని తయారు చేయించారు. ఇక ఈ వాహనం ద్వారా 200 పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులను గ్రామాల్లోనే ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ వాహనం శనివారం హిందూపురానికి చేరుకుంది. త్వరలోనే వాహనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇకపోతే ఈ ఎన్టీఆర్ ఆరోగ్య రధం వాహనంలో ఒక వైద్యుడు, ఫార్మసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ , ఒక నర్స్ , ఆరుగురు వైద్య సిబ్బంది, మందుల కౌంటర్ కూడా ఉంటాయి . సాధారణ వ్యాధులకు వాహనంలోనే వైద్యం అందించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారు.

ఇక ఇతర వైద్య సేవలకు అవసరమైతే వారిని పెద్ద ఆసుపత్రులకు సిఫార్సు చేస్తారు. వాహనం ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి వెళ్లి ప్రజలకు సేవలు అందించనుంది. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాలకు ఈ వాహనం వర్తిస్తుంది అని బాలయ్య తెలిపారు. లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఇటీవల సంజీవని ఆరోగ్య రథం పేరుతో ఉచిత వైద్య సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక అంతే కాదు ఈ వాహనంపై అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికి శుభమస్తు.. మన హిందూపురం.. మన బాలయ్య అని ఫోటోలు కూడా వేయించారు.