బిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. మోడీ 11,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభిస్తే అది కేసిఆర్ కు కంటగింపుగా ఉన్నట్లుందన్నారు. అందుకే మోడీ పర్యటనకు కేసిఆర్ గైర్హాజరయ్యారని మండిపడ్డారు. రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు అని అన్నారు ప్రభాకర్. రాజకీయ దుర్బుద్ధి కారణంగానే కేసీఆర్ మోడీకి స్వాగతం పలకలేదని.. కనీసం అభివృద్ధి పనుల్లో కూడా పాల్గొనలేదన్నారు.
ఈ విషయంలో కెసిఆర్ తన తప్పును ఒప్పుకొని చెంపలేసుకోవాలన్నారు. మోడీ వస్తే చాలు కెసిఆర్ తప్పించుకొని తిరుగుతున్నాడని ఆరోపించారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఇంత నీచ స్థాయికి దిగజారలేదని మండిపడ్డారు. మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, జగన్ సైతం మోడీపై విమర్శలు చేసినప్పటికీ అభివృద్ధి ప్రారంభోత్సవాలలో భాగస్వాములు అయ్యారని.. వాళ్లని చూసి కేసిఆర్ నేర్చుకోవాలని సూచించారు.
మోడీ సభ అనంతరం బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు కానీ.. కల్వకుంట్ల కుటుంబం ఎక్కడ మోడీని విమర్శించే ధైర్యం చేయలేదన్నారు. అలా చేస్తే కుటుంబ పాలన అనేది స్పష్టంగా కనిపిస్తుందని ట్విట్టర్ కి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. లీకు వీరుడు, లిక్కర్ రాణిని ఎలా కాపాడుకోవాలని మాత్రమే బిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని.. వారికి అభివృద్ధి పట్టదని అన్నారు.