మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కు నుంచి కొద్దిరోజుల క్రితం తప్పించుకున్న మగ చీతా ‘ఒబాన్’ని ఎట్టకేలకు అధికారులు గుర్తించారు. తాజాగా ఒబాన్ను గుర్తించిన అధికారులు తిరిగి పార్కులో విడిచిపెట్టారు. శ్యోపుర్ జిల్లా పరిధిలోని పార్కు నుంచి తప్పించుకున్న ఈ చీతా ఆ తర్వాత సమీప గ్రామంలో కనిపించింది. ఒబాన్ మెడలోని ప్రత్యేక పరికరం ద్వారా దాని కదలికలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచారు.
తాజాగా శివపురి జిల్లాలోని అడవిలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం దానిని జాతీయ పార్కుకు తీసుకొచ్చినట్లు అటవీశాఖ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. నమీబియా నుంచి గతేడాది భారత్‌కు తీసుకువచ్చిన 8 చీతాల్లో ‘ఒబాన్’ ఒకటి. ఈ నెల రెండో తేదీన పార్కు నుంచి బయటకు పెళ్లిపోయిన విషయం తెలిసిందే.
అయితే ఒబాన్‌ని ఎలా పట్టుకున్నదీ, దానికి మత్తుమందు ఇచ్చారా? వంటి వివరాలేమీ అధికారులు ప్రకటించలేదు. మరోవైపు, ఆశా అనే చీతా పార్కులోని రక్షిత అటవీ ప్రాంతాన్ని దాటి వీర్‌పుర్ ప్రాంతంలోని బఫర్ జోన్‌లోకి వెళ్లగా అధికారులు దాని కదలికలపై నిఘా పెట్టారు.