సాధారణంగా అధికారులను మంత్రులు లెక్కచేయరని వింటూ ఉంటాం. కానీ, చిత్రంగా వైసీపీలో ఇది రివర్స్ అయింది. అధికారులే ఓ మంత్రిని లెక్కచేయడం లేదని, కనీసం ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సీఎం జగన్ మాత్రం కలెక్టర్ల నుంచి ఎస్పీ ల వరకు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు వచ్చినా.. చిరునవ్వుతో ఆహ్వానించండి.. వారు చెప్పేది వినండి అని చెబుతున్నారు. వీరి మాటేమోకానీ.. ఏకంగా మంత్రినే లెక్కచేయడం లేదట.. అధికారులు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కమ్ మంత్రి కన్నబాబు.. గట్టి వాయిస్ ఉన్న నాయకుడు.
అయితే, ఈ వాయిస్ అధికారులపై పనిచేయడం లేదని తెలుస్తోంది. ఆయన మాటలను ఎవరూ లెక్కచే యడం లేదని అంటున్నారు స్థానిక నేతలు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు.. అదేసమయం లో విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా కూడా చక్రం తిప్పుతున్నారు. దీనికితోడు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే బాధ్యతను కూడా జగన్ ఈయనకు అప్పగించారు. దీంతో ఒకింత బిజీగానేఉన్నారు. పలితంగా తన నియోజకవర్గంపై ఆయన పట్టుకోల్పోయారనే టాక్ ఉంది. దీంతో కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ కూడా తమకు నచ్చిన విధంగా ఉన్నారని అంటున్నారు.
ఇటీవల జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్స కార్యక్రమానికి సంబంధించి అధికారులే అన్నీ సిద్ధం చేశారు. వాస్తవానికి ఇలాంటి కీలకమైన కార్యక్రమం నిర్వహించే సమయంలో నియోజకవర్గంలో మంత్రికి సమాచారం పంపుతారు. లేదా స్వయంగా వచ్చి కలుస్తారు. కానీ.. మంత్రి కన్నబాబుకు మాటమాత్రమైనా చెప్పకుండానే వారు నేరుగా కార్యక్రమానికి ప్లాన్ చేశారు. దీంతో మంత్రి తీవ్రంగా హర్టయి.. వేరే చోట కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ పరిణామం నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో చర్చకు వచ్చింది. ఇదిలావుంటే.. రూరల్ నియోజకవర్గంలో తనిఖీల పేరిట కలెక్టర్ హల్‌చల్ చేశారు.
ఈ విషయంలోనూ మంత్రికి ఎలాంటి సమాచారం లేదట! ఇది మరింతగా కన్నబాబును హర్ట్ అయ్యేలా చేసిందని అంటున్నారు. దీంతో అధికారులకు, మంత్రి పడడం లేదనే ప్రచారం జోరుగా సాగుతుండడం గమనార్హం. మరి ఈ వాతావరణం ఎలా సర్దుమణుగుతుందో చూడాలి.