శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో తెలంగాణలో ఉన్న నదులకు భారీగా వరదలు పోటెత్తాయి. ఇప్పటికే భాగ్యనగర పరిసర ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆయా ప్రాజెక్టుల అధికారులు వరద ఉధృత్తి కొనసాగడంతో గేట్లు ఎత్తివేశారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,10,690 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్

వరద ప్రవాహం కొనసాగడంతో అధికారులు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తివేశారు. 99,940 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కాకతీయ కాలువకు 3,500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5,000 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. కానీ ప్రస్తుతం నీటిమట్టం 1087.6కి చేరింది. కాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు.