ఓమిక్రాన్ పై కేంద్రం వార్నింగ్.. రెండు మూడు రోజుల్లోనే కేసులు సంఖ్య రెట్టింపు అవుతాయి..

ఓమిక్రాన్ పై కేంద్రం వార్నింగ్ ఇస్తోంది. డెల్టా వేరియంట్ కన్నా ఓమిక్రాన్ వేగం వృద్ధి చెందుతుందని.. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిందని.. కేసులు 1.5-3 రోజుల్లో రెట్టింపు అవుతాయి, కాబట్టి మేము కోవిడ్ తగిన ప్రవర్తనతో అప్రమత్తంగా ఉండాలి అని కేంద్రం ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషన్ అన్నారు. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ.. రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేసిందని.. రాత్రి పూట కర్ప్యూ, ప్రజలు గుమిగూడటాన్ని నియంత్రించాలని అందుకు ఆంక్షలు విధించాలని సూచించిందని.. బెడ్ల కెపాసిటీ, మెడిసిన్స్ సిద్దం చేసుకోవాలని.. కోవిడ్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

దేశంలో ఇప్పటి వరకు 89 శాతం మందికి కరోనా మొదటి డోసును అందించామని… 61 శాతం మందికి రెండో డోసు వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేశామని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనరకు 18,10,083 ఐసోలేషన్ బెడ్లు, దీనికి సపోర్టుగా 4,94,314 O2 బెడ్లు, 1,39,300 ఐసీయూ బెడ్లు, 24,057 పీడియాట్రిక్ ఐసీయూ, 64,796 పీడియాట్రిక్ నాన్-ICU పడకలు అందుబాటులో ఉన్నాయని రాజేష్ భూషన్ వెల్లడించారు. ప్రస్తుతం డెల్టా చికిత్స ప్రోటోకాల్స్ ను ఓమిక్రాన్ కు కూడా వర్తింపచేస్తున్నామన్నారు. ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్ కు దేశంలో ఆక్సిజన్ డిమాండ్ 10 రెట్లకు పెరిగిందని.. ప్రస్తుతం రోజుకు 18,800 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. 11 రాష్ట్రాల్లో టీకా కవరేజీ జాతీయ సగటు కన్నా తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు.