ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. దీంతో అనేక జిల్లాలు మళ్ళీ మూతబడుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల లాక్ డౌన్ విధించగా.. తాజాగా.. శ్రీకాళహస్తిలో మరోసారి లాక్ డౌన్ విధించబోతున్నట్టు తెలుస్తుంది. కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో శ్రీకాళహస్తిలో మళ్లీ లాక్‌డౌన్ విధించబోతున్నట్టు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ శ్రీకాంత్ ప్రకటన చేశారు. ఎవరైనా కరోనా ఉల్లంఘన చర్యలకు పాల్పడితే తాట తీస్తామని శాఖాపర అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రేపటి నుంచి పట్టణంలోని ప్రోవిజన్ స్టోర్స్, బట్టల షాపులు, చికెన్, మటన్ షాపులు అన్ని రకములైన దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెరవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని ప్రతి దుకాణదారులు భౌతిక దూరం పాటిస్తూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినా, ముఖానికి మాస్క్ లు లేకపోయినా ఫైన్ లు తప్పవంటు హెచ్చరించారు. అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుండి తిరిగి మరుసటి రోజు ఉదయం వరకు పూర్తిగా కర్ఫ్యూ ఉంటుందని పేర్కొన్నారు.